24. భారమైన వేపమాను

ప : భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదేకాక తీయనుండేనా

చ : పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి
చాయ కెంతగట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినేనా

చ : ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యినా
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది
దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా

చ : కూరిమితో తేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారె సారె గుట్టుగాక చక్కనుండీనా
వేరులేని మహిమల వేంకటవిభుని కృపా
ఘోరమైన ఆశ మేలుకోర సోకీనా


0 comments: