2. అలర చెంచలమైన...

ప : అలర చెంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల

చ : ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

చ : పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె నుయ్యాల

చ : మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె నుయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె నుయ్యాల

చ : పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు నుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగునో యని భీతి నొయ్య నొయ్యన వూచిరుయ్యాల

చ : కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందందు చూపె నీ వుయ్యాల

చ : కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె నుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల

Listen to Audio
అలర చెంచలమైన...


Meaning / వివరణ :

ఆన్నమాచార్యులవారు భగవంతుదు చేసే ఈ జగత్ సృష్ఠి రక్షణ ప్రళయములను ఒక ఉయ్యాల ఆటతో పోల్చుచున్నారు।చంచలస్వభావము కలిగిన జీవాత్మలకు ఈ ఉయ్యాలలో నుండుట అలవాటైనది।జీవులు పీల్చే ఉఛ్ఛ్వాసములో నీభావము తెలుస్తుంది। ఉఛ్చ్వాసము ఓంకారము। ఓంకారమునందు నారాయణుడు సర్వనిర్వాహకుడని, అతనికి జీవాత్ముడు దాసుడని , జీవాత్ముని లక్షణమదే అని, దాస్యమవలంబించిన జీవాత్ముడు ముక్తి కర్హుడై పరమాత్మతో యావత్కాలమును సుఖించుననే భావము గర్భితమై యున్నది।ఇది ఈ ఉయ్యాలలోనిదే।

సూర్యుడుదయించు అస్త మించు రెండు కొండలును స్తంభములయితే నక్షత్రమండల మంతయును ఈ ఉయ్యాలను మోయుచున్నది। ఈ ఉయ్యాలకు ఆకాశము అడ్డదూలము। కనుక నీ ఉయ్యాల సమస్త ప్రపంచమును నిండియున్నది।


ఉయ్యాలకు నాలుగు వేదములను బంగారు గొలుసులు।(జగత్ క్రియా కలాపములకు వేదములే ఆధారము) ఉయ్యాల పట్టి సంఖ్యాశాస్త్రము।(మూడు లోకములు , సప్తకుల పర్వతములు, త్రిగుణములు , అరిషడ్వర్గములు, చతుర్దశవిద్యలు మొదలయిన వ్యవహార మంతయు సంఖ్యాశాస్త్రము మీదనే ఆధారపడినది కనుక ఆ పట్టి సంఖ్యాశాస్త్రము)। ధర్మదేవత పీఠము।


మేఘమండలము మేలు కట్లు (బందుకట్లు)। ఈ ఉయ్యాల మెరుగుకు మెరుగు (చాలా మేలయినది)। నల్లని కొండలవంటి నీ మేని కాంతికిది నిజమైన ఆభరణము।(స్వామి యొక్క మేనిపైననే జగత్తులాధారపడియున్నవి, కనుక ఇవియే స్వామికి నగలు)।


స్తనములు కదులుచుండగా, పైటకొంగులు రాచుకొణగా స్త్రీలు ఊపే ఉయ్యాల ఇది।(భగవంతుడూపే ఈ ఉయ్యాలకు బ్రహ్మాది దేవతలు తక్కిన జీవాత్మలు కూడ సహాయ భూతులు కనుక వారు ఊపే ఉయ్యాల ఇది। అయితే వీరందరూ స్త్రీలు।"స్త్రీప్రాయమితరంజగత్ = భగవంతుడొక్కడే స్వతంత్రత కలిగిన పురుషుడు తక్కిన వారందరు భగవంతునకు పరతంత్రులు కనుక స్త్రీలే" అని శాస్త్ర నిర్ణయము। వీరు కూడ ఈ ఉయ్యాల నూపుచున్నరు కదా) ఆ స్త్రీలు బ్రహ్మాండములన్నీ ఒరిగిపోతాయనే భయంతో ఊపుచున్నారు।(జగత్ క్రియలను భగవంతుడు నిర్భయంగా చేస్తాడు , తక్కిన వారు పరతంత్రులు కనుక భయంతో చేస్తారు।)


ఈ ఉయ్యాలలో నున్న శ్రీదేవి భూదేవి ప్రతి కదలికకు నిన్ను కౌగిలించుకొందురు కదా ! స్వామీ ! దేవతా స్త్రీలకు ఈ ఉయ్యాలలోనే నీ హావభావ విలాసములు తెలుస్తాయి।


బ్రహ్మాదులకు కూడ ఇది ఆశ్చర్యకరమై వర్ణింపనలవి కాదు। కన్నుల పండువయినది। ఓ వేంకటేశ్వరా ! ఈ ఉయ్యాల ఊపుట నీకు వేడుకయిన లీల।(స్వామికు వైకుంఠము భోగము కొరకని తక్కిన లోకములు లీల కొరకని సంప్రదాయము ) ఈ పదము అన్నమయ్య గారి భావుకతకు నిదర్శనము।

0 comments: